కరోనా.. సీసీసీకి కాజల్‌ విరాళం

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్‌ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్‌ చారిటీ(సీసీసీ) మనకోసంను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ సంస్థకు పలువురు సినీ ప్రముఖులు విరాళాలు అందజేశారు. తాజాగా ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ సినీ కార్మికులకు తనవంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. సీసీసీకి రూ. 2 లక్షల విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కాజల్‌ మేనేజర్‌ గిరిధర్‌ మాట్లాడుతూ.. రూ. 2లక్షలను గురువారం రోజున ఆర్టీజీఎస్‌ ద్వారా సీసీసీకి ట్రాన్స్‌ఫర్‌ చేసినట్టు చెప్పారు.